
- రద్దు చేసిన 1000, 500 నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
- 10 శాతం కమీషన్‌పై మార్చడానికి ముఠా ఒప్పందం
- నిఘా పెట్టి పట్టుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
బషీర్‌బాగ్, వెలుగు: నగరంలో పాత కరెన్సీ నోట్లు కలకలం సృష్టించాయి. రద్దయిన నోట్లను మార్చేందుకు యత్నించిన ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు సయ్యద్ ముజమ్మిల్ హుస్సేన్, సహకరించిన అంజాద్ ఖాన్, పల్తీ భాస్కర్, షేక్ నజీమాను అదుపులోకి తీసుకున్నారు.హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముజమ్మిల్ హుస్సేన్టోలీచౌకిలో టెంట్ హౌస్ నిర్వహిస్తున్నాడు.
గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. 2006లో వృత్తి రీత్యా దుబాయ్ వెళ్లి 2019లో హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అతని కుటుంబం రూ.30 లక్షల కరెన్సీ నోట్లను దాచిపెట్టింది. నోట్లు రద్దయిన సమయంలో మార్పిడి చేస్తే, ఇన్కమ్ టాక్స్ కట్టాల్సి వస్తుందని మార్పిడి చేయలేదు. పాత నోట్ల మార్పిడి సమయం పూర్తయిన తరువాత వాటిని మార్చేందుకు హుస్సేన్ప్రయత్నించగా సాధ్యం కాలేదు.
హుస్సేన్స్నేహితుడు అంజాద్ ఖాన్ వద్ద రూ.25,52,500 రద్దయిన నోట్లు ఉన్నాయి. ఇద్దరూ కలిసి నోట్లు మార్చేందుకు కొన్నేండ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వారికి పల్తీ భాస్కర్, షేక్ నసీమా అనే నోట్ల మార్పిడి ఏజెంట్లు(5 శాతం కమిషన్ తీసుకొనే) వారు పరిచయం అయ్యారు. వారి వద్ద ఉన్న నోట్లను10 శాతం తక్కువతో మారుస్తామని హామీ ఇచ్చారు.
ఈ నెల15న రాత్రి అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ మహల్ హోటల్ సమీపంలో నోట్లను మార్చడానికి యత్నిస్తుండగా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రద్దయిన వెయ్యి రూపాయల నోట్లు 4,338 , ఐదు వందల నోట్లు 2,429 కలిపి మొత్తం రూ.55,52,500 స్వాధీనం చేసుకున్నారు. సీజ్చేసిన నగదును, ముఠాను అబిడ్స్ పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ వెల్లడించారు